నా పేరు గరిమెళ్ళ రాజేంద్ర ప్రసాద్."గరిమెళ్ళ గమనాలు" అను నా కలం పేరుతో మీ అందరికీ సుపరిచయమే అని భావిస్తున్నాను.
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక నా స్వప్నం నేడు నా "కవితా సంపుటి" రూపంలో ఆవిష్కారం అవుతుంది.ఇది నా మొదటి కవితా సంపుటి పేరు "ఒక స్వప్నం కోసం" చిన్నప్పటి నుంచి ఎన్నో కలలు కనే ఉంటాం. అవి కొందరు నిజం చేసుకుంటారు. ఇంకొందరు నిజం అయితే బాగుండు అని ఆలోచన చేస్తూ ఉంటారు.ఇది నా సాహితీ ప్రస్థానంలో నేను వేసే ముందు అడుగు ఈ పుస్తకం. ఈ సాహిత్య ప్రపంచంలో ఒక చిన్న మైలు రాయిని నేను. పరిస్థితులను గమనిస్తూ , జీవితాన్ని అన్వేషిస్తూ ,సమాజాన్ని ప్రశ్నిస్తూ, ఒక మంచి మార్పుకై ఎదురుచూస్తూ రాస్తున్న , రాసుకున్న నా కవితల లో నుంచి కొన్నింటిని పుస్తక రూపంలో సాక్ష్యంగా నా వంతు నేను చేస్తున్న ప్రయత్నం ఈ "ఒక స్వప్నం కోసం"
నా పరిచయానికి వస్టే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లో కేసరపల్లి అను గ్రామం నా స్వస్థలం . వృత్తి రీత్యా హైదరాబాద్ లో కొన్ని సంవత్సరాలుగా సెటిల్ అయ్యాను.. మా నాన్న గారి పేరు కీ. శే . సాంబశివరావు . అమ్మ పేరు పద్మావతి. నాన్న పిన్న వయసులోనే కాలం చేయటం వలన అమ్మ ప్రేమతో గారాబంగా పెరిగాను. అమ్మ చేపట్టిన బాధ్యతలో నేను కూడా ఒక క్రమశిక్షణ తోనే , మా అమ్మమ్మ గారింట్లో మేన మామ గారైన "దేవళ శ్రీనివాసరావు" ఆధ్వర్యంలో విద్యాభ్యాసం కంప్లీట్ చేశాను. అమ్మంటే బాధ్యతగా , అమ్మనే దేవతగా భావించి , అమ్మ చెప్పిన మాటతో నా జీవితానికి బాట వేసుకుని, "పద్మ" ను వివాహం చేసుకుని నా కూతురు గారాల పట్టీ "లేక్షణ" తో సంతోషంగా ,విజయవంతం గానే జీవిస్తున్నా అని చెప్పవచ్చు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పరిజ్ఞానం కొంచెం ఉండటం చేత నాకు తోచినట్టుగా తెలియని వాటి గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస తో తెలుసుకుంటూ నన్ను నేను చదువుకుంటూ ఎదిగాను.నా బాల్యంలో కవి అంటే తెలియని వారిని చూసాను. అస్సలు ఆ పథం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేని స్థానం నాది. నాకు నేను పాటల రూపంలో ,కథల రూపంలో రాసుకుంటూ పాడుకునే వాడిని, చెప్పుకునే వాడిని. కవి అంటే ఏంటో తెలియని స్థాయి నుంచి నేడు కవులను కోకొల్లలు గా కూడా గలగటం ,వారిలో నేను కూడా ఒక కవిగా మారి నేడు నా కవితా సంపుటిని విడుదల చేసే స్థాయికి రావటం చాలా హర్షణీయం.
బాల్యంలో తరచుగా చదువుకున్నది ,నేర్చుకున్నది "మాతృ దేవోభవ ,పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ ,కాబట్టి ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లదండ్రులకు పాదాభివందనాల తో నమస్సులు .అలానే నాకు సకల విద్యా బుద్దులు నేర్పించి ,నేను జీవితంలో రాణించుటకు కారణమైన నా గురువులు శ్రీ నాదేండ్ల లక్ష్మణ్ రావు గారు మరియు శ్రీ తిరుపతి రెడ్డి గార్లకు నా హృదపూర్వక నమస్సులు తెలియ.చేసుకుంటున్నాను. నా బాల్యం నుంచి చదువుతో పాటు ,పుస్తక పఠనాలు ,పేపర్లో వచ్చే ఆర్టికల్స్ ని , ఆసక్తిగా చదివి ఫాలో అవుతూ నాలో కూడా రచించే శక్తి ఉందని తెలుసుకున్నాను. నేను 9th లో రాసిన మొట్టమొదటి కవిత "జన్మ భూమి" దానికి స్కూల్లో ప్రైజ్ కూడా వచ్చింది. నేను చిన్నతనంలో రాసిన కథలు "రాక్షస బల్లి" & "ఎగ్జిబిషన్ " అలా అలా ఇంటర్లో ,డిగ్రీలో కొన్ని కొన్ని కవితలు రాయటం ,వాటిని పదిల పరుచుకోవటం , స్నేహితులకు ,బంధువులకు చదివి వినిపించడం చేస్తూ ఉండే వాడిని. అయితే నేను ఎక్కువగా ఆసక్తి కనపర్చి ,కవిగా గుర్తింపు తెచ్చుకుంది మాత్రం "ముఖ పుస్తకం" ద్వారానే. నేను ఫేస్ బుక్ లో నేను కవితలు రాయటానికి ,కవిగా గుర్తింపు తెచ్చుకోడానికి అవకాశం ఇచ్చిన "మన తెలుగు మన సంస్కృతి" గ్రూప్ ల అడ్మిన్స్ శ్రీ మీగడ త్రినాథ్ రావుగారు & శ్రీమతి మంజు యనమదల గారికి నా కృతజ్ఞతలు .అలానే "సాహితీ సేవ" గ్రూప్ అడ్మిన్స్ శ్రీ కంచర్ల సుబ్బానాయుడు గారు & శ్రీమతి వడ్డే సిరి గార్లకు నా కృతజ్ఞతలు .నేను రాసే పాటలను ప్రోత్సహిస్తూ నాకు లిరిక్ రైటర్ గా అవకాశం ఇచ్చిన "మ్యూజిక్ వరల్డ్" గ్రూప్ అడ్మిన్స్ రాజేష్ గారు ,శ్రీమతి అరుణ గారు , మారుతి కుమార్ గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
సుజాత తిమ్మన గారు :-
సుజాత గారు నాకు ముఖ పుస్తకం అందించిన మంచి ఆత్మీయురాలు , శ్రేయోభిలాషి ,మాతృ సమానులు. నాకు ఈవిడ పరిచయం అయినాక నా జీవితంలో ,నా సాహితీ ప్రస్థానంలో అమ్మది ప్రముఖ పాత్ర అని చెప్పవచ్చు. తల్లిగా స్నేహితరాలిగా, సలహాలు సూచిస్తూ , మార్గనిర్దేశం చూపుతూ,నాలోని ప్రతిభని ప్రోత్సహిస్తూ ,నాకు ఒక ఇన్స్పిరేషన్ గా ,గైడ్ గా ఉండేవారు. నా పుస్తకానికి తొలిపలుకు లు అందించి మనస్పూర్తిగా ఆశీర్వదించి నందుకు ప్రేమతో నా నమస్సులు తెలియ చేసుకుంటున్నాను.
డా. కట్టిమండ ప్రతాప్ గారు :
నేను బాగా రాస్తున్నా నని ,నా కవితలు బాగుంటాయని ఇలానే కొనసాగాలని ప్రోత్సహించే వారు . పత్రికలకి పంపటం తెలియని నాకు నా కవితల్ని పత్రికలకు పంపి పబ్లిష్ చేయించారు .వారు నిర్వహించే కవి సమ్మేళనాలు లో, సభలలో నాకు ప్రత్యేక పాత్రను కనపరిచి ,బాధ్యతలు ఇచ్చి ముందుకు నడిపించే వారు .వీరు ప్రపంచ ప్రఖ్యాత గాంచిన కవి , ప్రభుత్వ గుఱ్ఱం జాషువా అవార్డ్ గ్రహీత ,సాహితీ భూషణ్ ,అక్షర తపస్వి .వీరి కలం నుండి పుట్టే ప్రతీ అక్షరం సమాజ చైతన్యాన్ని ,స్ఫూర్తిని కల్గిస్తుంది. సమాజ శ్రేయస్సుకై వీరి కలం ఎప్పుడూ మండే కత్తిలా పోరు కొనసాగిస్తూనే ఉంటుంది .నాకు వీరు సోదరా సమానులు , ఆత్మీయులు ,ఎప్పుడూ చిరునవ్వుతో ఆత్మీయంగా పలకరిస్తారు. నాలాంటి వారెందరో వర్ధమాన కవులకు మార్గ దర్శకులు .ప్రస్తుతం శ్రీ శ్రీ కలావేదిక ను స్థాపించి శాకోపశాఖలుగా విస్తరింప చేస్తూ కవులను/ కళాకారులను ముందుకు నడిపించే నేటి మేటి కవి రథసారథి ,కవి చక్రవర్తి శ్రీ శ్రీ కళా వేదిక చైర్మన్ డా. కత్తి మండ ప్రతాప్. నాకోసం నేడు వారి విలువైన సమయాన్ని వెచ్చించి నా కవితా సంపుటికి వారి మాటను జతకలిపి
మరింత ఆనందాన్ని అందించిన వారికి అభిమానంతో కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
పొట్లూరి హరికృష్ణ గారు
అక్షరాన్ని ఆరాధిస్తూ
వాక్యాన్ని విశ్లేషిస్తూ
కావ్యాన్ని విశదీకరిస్తూ
కవిత్వాన్ని కీర్తిస్తూ
సాహిత్యాన్ని శ్వాసిస్తూ
కవులను /కళాకారులను ప్రోత్సహిస్తూ
తెలుగు జాతి ఔనత్యం కోసం ,తెలుగు జాతి అభివృద్ధి కోసం ,తెలుగు వెలుగులు అందరికీ పంచటం కోసం ,తెలుగు ఉనికిని కాపాడటం కోసం తన వంతు బాధ్యత గా ,ఉషోదయిస్తున్న సూర్యిడిలా , తెలుగు రక్షణ వేదికనుస్థాపించి ,ఎన్నో సాహితీ కార్యక్రమాలను నిర్వహించి ,ఎంతో మంది కవులకు చేయూత నిస్తూ,కొత్త కొత్త సమూహాలకు ,సంస్థలకు ఊపిరి పోస్తూ అందరికీ దారి చూపించిన భవనీయులు, అక్షర సేద్యం చేస్తున్న నిత్య కృషీ వలులు. అక్షర ప్రేమికులకు ,సాహితీ ఉపాసకులకు ఎప్పుడూ వెన్నంటి నేనున్నా అంటూ ముందుకు నడిపించే మార్గ దర్శకులు .ఎంత ఎదిగినా కించిత్ గర్వం కూడా చూపకుండా ప్రేమగా అందరికీ ఎదురెల్లి పలకరించే ఆప్తబందువు. నాకు సోదర సమానులు , ఆత్మీయులు, శ్రేయోభిలాషి, నాలాంటి వారి మరెందరికో హితాన్ని బోధించే గురువు. పిలిచినా పలికే తత్వం ,వీరితో నా పరిచయం నా సాహితీ ప్రస్థానంలో నూతన అధ్యాయానికి శ్రీకార మవుతుంది. ఈ కవితా సంపుటి మొత్తం తానే స్వయంగా సంపూర్ణ బాధ్యత తీసుకుని , రూపకల్పన కు ,సహకారం ఇచ్చి అమూల్యమైన వారి మాటలను ముందు మాట గా రాసి ,నన్ను ప్రోత్సహించి , ఆశీర్వదించి నందుకు ప్రేమతో హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసు కుంటున్నాను.